NEWS BUZZ
దేశంలోని అన్ని ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య చికిత్సలకు సంబంధించిన ధరలను స్పష్టంగా ప్రదర్శించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రోగులకు మెరుగైన సేవలందించడంతో పాటు, ఆస్పత్రి బిల్లుల విషయంలో పారదర్శకతను పెంచే లక్ష్యంతో కేంద్రం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు అధికారిక లేఖలు రాసింది.
వివాదాలకు చెక్ పెట్టేందుకే.. సాధారణంగా ఆస్పత్రుల్లో చికిత్స ముగిసిన తర్వాత భారీ బిల్లులు రావడం, వాటిపై రోగులు, ఆస్పత్రి యాజమాన్యాల మధ్య తరచూ వివాదాలు తలెత్తడం జరుగుతుంటుంది. ఈ రకమైన ఫిర్యాదులను పూర్తిగా తగ్గించడమే ఈ కొత్త నిబంధన ప్రధాన ఉద్దేశమని కేంద్రం తన లేఖలో పేర్కొంది. ట్రీట్మెంట్ ఖర్చులు ముందుగానే రోగికి లేదా వారి కుటుంబ సభ్యులకు స్పష్టంగా తెలిస్తే అనవసర ఆందోళనలు తొలగిపోతాయని భావిస్తున్నారు.
స్థానిక భాషలోనూ వివరాలు తప్పనిసరి.. ఆస్పత్రిలో అందించే ప్రతి రకమైన వైద్య పరీక్ష, ఆపరేషన్, గది అద్దెలు, డాక్టర్ ఫీజులు వంటి అన్ని వివరాలను రోగులకు సులభంగా కనిపించే ప్రదేశంలో డిస్ ప్లే చేయాలి. అంతేకాకుండా, ఈ రేట్లను ఆంగ్లంతో పాటు ఆయా రాష్ట్రాల స్థానిక భాషలోనూ విధిగా ప్రదర్శించాలని కేంద్రం స్పష్టం చేసింది. దీనివల్ల సాధారణ ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ధరలను చదువుకుని అవగాహన తెచ్చుకోవడానికి వీలవుతుంది.
అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే.. కేంద్రం జారీ చేసిన ఈ మార్గదర్శకాలను పక్కాగా అమలు చేసే పూర్తి బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించారు. ఆస్పత్రులు ఈ నిబంధనలను పాటిస్తున్నాయా లేదా అనే అంశంపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం కొరింది.